తల్లిదండ్రులను వెతికేందుకు రెండురోజుల క్రితం బాసరకు తీసుకొచ్చిన మూగ యువతి గీత తమ కూతురేనంటూ మరికొందరు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు.మొన్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం గీత తమ కూతురేనని, కొన్ని ఆనవాళ్లను చెబుతూ.. ఆమెకు తమకు అప్పగించాలని కోరారు. తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన బొల్లి స్వామి గీత తమ బిడ్డేనంటూ కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చారు. తమ నుంచి ఎనిమిదేళ్ల వయసులో తప్పిపోయిందని.. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు సిద్ధంగా ఉన్నామని వారు అభ్యర్థించారు.
మరోవైపు గీత తమ కుమార్తెనే అంటూ ఇప్పటికే 40 పైకి కుటుంబాలు ముందుకొచ్చాయి. తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ట్రాలకు చెందిన పలువురు దంపతులు.. ఆమె తమ కూతురేనంటూ అభ్యర్థనలు చేశారు. దీంతో ఆమె ఎవరి బిడ్డనో తేల్చడం కష్టమవుతోంది. ప్రస్తుతం గీత తల్లిదండ్రులను వెతికేందుకు అధికారులు ఆమెను బాసర పరిసర ప్రాంతాల్లో తిప్పుతున్నారు.