దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వ బృందం పెట్టుబడుల వేట మొదలైంది. ఇందులో భాగంగానే ఆర్థిక వేదికపై తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పలువురు వ్యాపార దిగ్గజాలు, సీఈవోలతో సమావేశమవుతున్నారు.
ఈ క్రమంలోనే పెప్సికోతో పాటు మరో 2 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థ పెప్సికో ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ఆ సంస్థ ఉపాధ్యక్షులు రాబర్డో అజేవేడో ప్రకటించారు. ఏడాది కాలంలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సికో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపైన కేటీఆర్, రాబర్టో చర్చించారు. పెప్సికో నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు. ఇక మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు బ్యాటరీల తయారీలో ఎంతో పేరున్న అలాక్స్ సంస్థ ముందుకొచ్చింది. 750 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఉత్పత్తి చేయనున్నారు.
భవిష్యత్తులో పది గిగావాట్ల సామర్థ్యానికి పెంచి 2030 నాటికి మొత్తంగా 750 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. లండన్ తరువాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.