అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నాడని, రెండో పెళ్లి చేసుకున్నాడని అతని సోదరి హసీనా పార్కర్ కొడుకు అలీ షా తెలిపాడు. ఈ విషయాలను అతడు గత సెప్టెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ కి వెల్లడించాడు.’ దావూద్ ఓ పాకిస్థానీ మహిళను వివాహం చేసుకున్నాడు. తన మొదటి భార్య మెహ్ జా బీన్ షేఖ్ కి దావూద్ విడాకులు ఇవ్వలేదు. గత ఏడాది జులైలో దుబాయ్ లో నేను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఇవన్నీ చెప్పింది.. పైగా ఇండియాలో..ముఖ్యంగా ముంబైలోని తన బంధువులతో ఆమె వాట్సాప్ కాల్స్ చేస్తూనే ఉంది’ అని అలీ షా వివరించాడు.
ఇండియాలో దావూద్ టెర్రర్ నెట్ వర్క్ ని ఛేదించేందుకు ఎన్ఐఏ.. అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించి. . పలువురిని . అరెస్టు చేసింది. తన ఛార్జ్ షీట్ ని ఈ సంస్థ ముంబై లోని స్పెషల్ కోర్టుకు సమర్పించింది. అలీ షా స్టేట్మెంట్ కు సంబంధించిన ఓ కాపీ ఓ మీడియా సంస్థకు లభించగా ఈ తాజా విషయాలు వెల్లడయ్యాయి.
మెహ్ జా బీన్ నుంచి దర్యాప్తు సంస్థల దృష్టిని మళ్లించేందుకే దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నట్టు కనబడుతోందని అలీ షా పేర్కొన్నాడు. కరాచీలో అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనుక ప్రాంతంలోని డిఫెన్స్ ఏరియాలో దావూద్ నివసిస్తున్నట్టు ఆయన చెప్పాడు.
దావూద్ తో సహా అతని సహచరులైన ఛోటా షకీల్, ‘డీ’ కంపెనీకి చెందిన మరో ముగ్గురు సభ్యులపై ఎన్ఐఏ.. ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. వీరిని గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. ఇండియాలో ‘డీ’ కంపెనీ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులందించేందుకు అండర్ వాల్డ్ డాన్ దావూద్ హవాలా ద్వారా సొమ్ము పంపేవాడని ఈ సంస్థ పేర్కొంది. పట్టుబడిన నిందితులు.. ఈ సొమ్మును ముంబై సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో టెర్రరిస్టు దాడులకు వాడడానికి ఉద్దేశించారని తమ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైందని ఈ సంస్థ అధికారులు తెలిపారు.