అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ఎప్పటికీ తమ పౌరుడు కాలేడని కామన్వెల్త్ ఆఫ్ డొమినికా దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్టుబడులు పెట్టడంవల్లో, ఇతర మార్గాల్లోనే తమ దేశ పౌరసత్వం పొందుతున్నట్టు ప్రచారం జరగడాన్ని డొమినికా ఖండించింది. ఎవరైనా అలా భావిస్తున్నట్టయితే అది కచ్చితంగా తప్పేనని తెలిపింది.
పెట్టుబడులతో పాటు దేశ పౌర సమగ్రత కాపాడటం కూడా తమ బాధ్యతేనన్న డొమినికా.. అమెరికా, యూకే దేశాలకు చెందిన అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థలు సమగ్ర తనిఖీలు చేశాకే పెట్టుబడులకు అనుమతి ఇచ్చి.. ఆ పై పౌరసత్వం ఇస్తామని వెల్లడించింది. దావూద్ ఇబ్రహీం డొమినికాలో పెట్టుబడులు పెట్టి, తద్వారా వచ్చిన పౌరసత్వంతో ఆదేశంలో తలదాచుకుంటున్నాడని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో.. డొమినికా ప్రభుత్వం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
1993లో ముంబైల్‌లో జరిగిన సీరియల్ బ్లాస్టుల్లో దావూద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడు. నాటి పేలుళ్లలో 20 మందికి పైగా మరణించగా.. వందల మంది గాయపడ్డారు. దీంతో అతని కోసం ఇండియా ఎప్పటి నుంచో వెతుకుతోంది.