యూపీ బాటలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయాణిస్తోంది. రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో తరగతుల ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా మధ్యప్రదేశ్ సైతం ఇలాంటి నిర్ణయాన్ని రాష్ట్రంలోని మదర్సాలలో అమలు చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సూచన ప్రాయంగా వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… జాతీయ గీతాన్ని ప్రతి చోటా పాడాలని ఆయన అన్నారు.
మతపరమైన స్థలాల్లోనే కాకుండా ప్రతి చోటా ఈ నిబంధన ఉండాలన్నారు. దీనిపై కేబినెట్ లో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
‘ జాతీయ గీతాన్ని ప్రతిచోటా ఆలపించాలి. అలా చేయడం చాలా మంచి పని. అందుకే దాన్ని ప్రతిచోటా ప్రజలు ఆలపించాలని కోరుకుంటున్నాము’ అని మిశ్రా తెలిపారు.