ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ కి తృటిలో పెను అపాయం తప్పింది. ఢిల్లీ లోని ఎయిమ్స్ గేటు-2 వద్ద గురువారం తెల్లవారుజామున 3.11 గంటల ప్రాంతంలో ఆమె చెయ్యి కారు విండోలో చిక్కుకుపోగా డ్రైవర్.. అలాగే వాహనాన్ని సుమారు 10 నుంచి 15 మీటర్ల దూరం పోనిచ్చాడు. ఈ సంఘటన గురించి ఆమె ఆ తరువాత ట్వీట్ చేశారు.
నగరంలో రాత్రి వేళల్లో మహిళలకు ఎంత భద్రత ఉందో కనుగొనేందుకు తాను ఆప్రాంతం వద్దకు చేరుకున్నానని, అక్కడ ఆగి ఉన్న కారు డ్రైవర్.. కారులో నుంచే తనను లోపలి వచ్చి తనపక్కన కూర్చోవలసిందిగా కోరాడని ఆమె తెలిపింది. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ ని మందలించేందుకు తాను కారు వద్దకు వెళ్లి అతడిని బయటకు లాగ బోగా వెంటనే కారు విండో అద్దాలు పైకి లేపి వాహనాన్ని కొంతదూరం పోనిచ్చాడని ఆమె తెలిపారు. ఈ ఘటనలో తన చెయ్యి అందులో చిక్కుకుపోయిందన్నారు
. చివరకు హరీష్ చంద్ర అనే 47 ఏళ్ళ ఈ డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. ఆ తరువాత ఢిల్లీ పోలీసులు కూడా ఈ విషయాన్నీ ధృవీకరించారు. నైట్ గస్తీలో ఉన్న తమకు తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ఓ కాల్ అందిందని, ఆ ప్రదేశానికి చేరుకోగా ఆ మహిళ తనకు కలిగిన ప్రమాదం గురించి తమకు తెలిపిందని వారు చెప్పారు.
ఆమె ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ అని అప్పటికి తమకు తెలియదన్నారు. మద్యం తాగి మత్తులో ఉన్న ఆ డ్రైవర్ ని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ నెల 1 న అంజలీ సింగ్ అనే యువతిని సుమారు 12 మీటర్ల దూరం కారు ఈడ్చుకుపోయిన ఘటనలో ఆమె దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.