ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, హీరోయిన్ డింపుల్ హయతీ మధ్య వివాదం చెలరేగింది. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఎస్కేఆర్ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్ లో వీళ్లిద్దరు ఉంటున్నారు. అయితే.. పార్కింగ్ విషయంలో వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డింపుల్ పార్క్ చేసిన తమ వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిందని.. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ వీరంగం సృష్టించిందని డీసీపీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే.. గత వారం రోజులుగా డింపుల్ కారుపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె గొడవకు దిగి ఉంటుందని అనుకుంటున్నారు. చలాన్లతో పాటు పార్కింగ్ విషయంలోనూ వివాదం ముదిరిందని పోలీసులు భావిస్తున్నారు. డింపుల్ పై 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై డీసీపీ మాట్లాడారు. డింపుల్, తాను ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నామని.. సెల్లార్ లో తన కారుకు అడ్డంగా ఆమె కారు పెడుతోందని ఆరోపించారు. తాను అత్యవసరంగా బయటకు వెళ్లేటప్పుడు ఇబ్బంది అవుతోందని.. ఈ విషయంలో వ్యక్తిగతంగా వెళ్లి కలిసి రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోయిందన్నారు. అయితే.. డింపుల్ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. ముందుగా ‘‘అధికారంతో చేసిన తప్పును కప్పి పుచ్చలేరు’’ అని ట్వీట్ చేసింది. తర్వాత.. ‘‘ఈ వ్యవహారంలో అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞురాలిని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఈ విషయం గురించి నేను ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అభిమానులు దయచేసి సహనంతో ఉండాలని కోరుకుంటున్నా. నా లీగల్ టీమ్ చూసుకుంటుంది’’ అని తెలిపింది.
ఈ నేపథ్యంలో… డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ స్పందించారు. ఆమెపై తప్పుడు కేసు పెట్టారన్నారు. డింపుల్ తో డీసీపీ చాలా సార్లు అమర్యాదగా మాట్లాడారని.. ఆమె పార్కింగ్ ప్లేస్ లో కోన్స్ పెట్టారని ఆరోపించారు. ఆమె ఒక సెలబ్రిటీ అని, డీసీపీకి చాలా సార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్ ను మాత్రమే కాలితో తన్నారని వివరించారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతానని చెప్పడంతో ఆమెపైనే కేసు పెట్టారని తెలిపారు. వేధించాలి అనేదే డీసీపీ ఉద్దేశమన్న ఆయన.. రాహుల్ హెగ్డే తన క్వార్టర్స్ లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.