ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చెయ్యి ఓ కారు విండోలో చిక్కుకుపోగా డ్రైవర్ ఆమెను అలాగే 10-15 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లినట్టున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో అంతా స్టేజ్ డ్రామా అని, ఢిల్లీ పోలీసులను అప్రదిష్ట పాల్జేసేందుకే ఆమె ఓ న్యూస్ ఛానల్ తో కలిసి ఇలా చేసిందని బీజేపీ ఆరోపించింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం కూడా ఉందని బీజేపీ నేత షాజియా ఇల్మి పేర్కొన్నారు. స్వాతి మలివాల్ తో కలిసి ఆప్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందని, ఎలాగైనా ఢిల్లీ పోలీసులను అప్రదిష్ట పాల్జేయాలన్నదే వారి ఉద్దేశమని ఆమె అన్నారు.
ఆ న్యూస్ ఛానల్ తన టీ ఆర్ఫీ రేటింగ్ ను పెంచుకోవడానికి స్వాతి మలివాల్ తోడ్పాటు తీసుకుందని, కానీ పోలీసుల అప్రమత్తతతో వారి కుట్ర విఫలమైందని షాజియా.. శుక్రవారం పేర్కొన్నారు. నిజంగా స్వాతిపై అలాంటి ఘటన జరిగి ఉంటే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయకుండా ఆమె సుమారు 14 గంటలు ఎందుకు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. హరీష్ ఖురానా అనే మరో బీజేపీ నేత కూడా ఇలాగే స్పందించారు. ఈ నెల 19 న తెల్లవారు జామున 2-3 గంటల మధ్య స్వాతి మలివాల్ అక్కడ ఏం చేస్తున్నదని, ఓ కారు విండో నుంచి తాళాలు తీసుకునేందుకు ఎందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా ట్వీట్ చేశారు. స్వాతి మలివాల్ ను ఆ కారు ఈడ్చుకుపోయినట్టు లేదని, వీడియోలో ఆమె కొంత దూరంలో ఆ వాహనం వద్ద నిలబడి ఉన్నట్టు కనిపించిందని కొందరు వ్యాఖ్యానించారు. ఆ రాత్రి ఆమెకు కొంత దూరంలో ఆ న్యూస్ ఛానల్ వాహనం కూడా ఉండవచ్చునని, ఈ వీడియోలో ఆమె గొంతు స్పష్టంగా వినిపించిందంటే ఆమె చిన్న లాపెల్ మైక్ పెట్టుకుని ఉండవచ్చునని కొందరు యూజర్లు అభిప్రాయపడ్డారు.
అయితే బీజేపీ ఆరోపణను ఖండించిన స్వాతి మలివాల్.. బాధితురాలినైన తనను మరింత మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. ఆ కారు డ్రైవర్ మద్యం తాగిన మత్తులో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, కారు విండోలో తన చెయ్యి చిక్కుకుపోగా నిర్లక్ష్యంగా అలాగే వాహనాన్ని కొంతదూరం నడిపాడని ఆమె అన్నారు. పోలీసులకు తాను మూడుసార్లు ఫోన్ చేశాక వారు వచ్చి ఆ డ్రైవర్ ని అరెస్టు చేశారని ఆమె తెలిపారు. అయితే మహేష్ చంద్ర అనే ఆ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరి బీజేపీ నేతలు పోలీసు వెర్షన్ కూడా తీసుకుని ఉండాల్సిందన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.