ఢిల్లీలో కారుతో గుద్ది ఓ యువతిని ఏడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటలు జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ ఐదు సూచనలు చేశారు.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆమె లేఖ రాశారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత వల్లే మహిళలు, బాలికలపై నేరాలు పెరుగుతున్నాయని తాము అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. అందువల్ల ఈ నేరాల కట్టడికి కొన్ని చర్యలను తాము సూచించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు.
హోం మంత్రిత్వ శాఖలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీ పోలీసు శాఖలో సిబ్బందిని పెంచాలన్నారు. అంతేకాకుండా పోలీసుల్లో జవాబుదారీతనాన్ని పెంచాలన్నారు. ఢిల్లీలో పీసీఆర్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఆధునికరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఢిల్లీ పోలీస్ శాఖలో 66,000 మంది సిబ్బందిని నూతనంగా నియమించాలని ఆమె కోరారు.
ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఓ యువతిని ఓ కారు ఢీకొట్టింది. సుమారు ఏడు కిలోమీటర్ల వరకు యువతిని కారు అలాగే ఈడ్చుకు వెళ్లింది. దీంతో ఆ యువతి మరణించింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.