ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని డ్యామ్ లో ముగ్గురు బాలికల మృతదేహాలు అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
జిల్లాలోని మౌరానీపుర్ పరిధిలో ఉన్న కురేచా డ్యామ్‌లో ఓ బాలిక మృతదేహం తేలుతున్నట్లు శనివారం సాయంత్రం పోలీసులకు స్థానిక ప్రజలు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు.. డ్యామ్ దగ్గరకు చేరుకుని బాలిక మృతదేహాన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత కాసేపటికే డ్యామ్‌లో మరో ఇద్దరి మృతదేహాలు తేలుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మళ్లీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
అసలు ఆ ముగ్గురు ఎవరు? వారిని హత్య చేసి డ్యామ్‌లో పడేశారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.మృతదేహాలపై ఎక్కడా ఎలాంటి గాయాలు కనిపించలేదని ఎస్పీ రాజేశ్ తెలిపారు. అయితే డ్యామ్ సమీపంలో మధ్యప్రదేశ్ సరిహద్దు గ్రామాలు ఉన్నాయని, నీటిలో తేలియాడుతూ మృతదేహాలు అటు వైపు నుంచి వచ్చాయేమోనని అనుమానంగా ఉందని తెలిపారు. అసలు కారణాలు మాత్రం శవపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే తెలుస్తాయని చెప్పారు.