ఒక హీరో…ఊరి చివర ఒక 40 ఎకరాల ఫార్మ్ హౌస్ కొంటాడు. కూరగాయలు పండిద్దామని చుట్టూ ఉన్న పొలంలో మనుషులను పెట్టుకొని పని మొదలుపెడతాడు. హీరోయిన్ అప్పుడప్పుడు వెళ్లి పొలం చూసి ఆనందపడుతూ ఉంటుంది. ఒక రోజు అకస్మాత్తుగా ఆ పొలంలో, ఒక మూలన ఉన్న గదిలో, ఒక అస్థిపంజరం దొరుకుతుంది. టాలీవుడ్ హారర్ సినిమా రాజు గారి గది సీక్వెల్ లో సీన్ కాదు ఇది…నిజంగా, నిజ జీవితంలో కింగ్ నాగార్జున లైఫ్ లో జరిగింది. నాగ్ ఫార్మ్ హౌస్ లో అకస్మాత్తుగా ఒక అస్థిపంజరం కనిపించింది.
హైదరాబాద్: షాద్‌నగర్ మండలం కేశంపేట దగ్గర ఉన్న పాపిరెడ్డిగూడెం గ్రామంలో అక్కినేని నాగార్జునకు సంబంధించిన 40 ఎకరాల వ్యవసాయ భూమి వుంది. నాగ్ సతీమణి అమల అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యడానికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. అలానే ఈ నెల 10 వ తేదీన కూడా సేంద్రియ వ్యవసాయ పనులకోసం వెళ్లి కాస్త టైం దొరికితే అక్కడకు వెళ్లారు. కొన్ని కాయగూరల మొక్కలు నాటి వచ్చారు. మళ్ళి అటువైపు నాగార్జున కుటుంబ సభ్యులు ఎవ్వరూ వెళ్ళలేదు. నిన్న కొంతమందిని వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడకి పంపించారు. వాళ్ళు పొలం చూస్తున్నప్పుడు, వాళ్ళకి అక్కడ ఒక పాడుబడ్డ గదిలో ఒక వ్యక్తి శవం దొరికింది.
వెంటనే కేశంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేశ్వరులు తన బృందంతో అక్కడకి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ గదిని సీజ్ చేసినట్టు సమాచారం. పూర్తిగా కుళ్లిపోయి, అస్తిపంజరంగా మారిన ఆ వ్యక్తి ఎవరై వుంటారు, ఎక్కడన్నా హత్య చేసి ఇక్కడ వదిలిపెట్టారు? లేదా ఇక్కడే హత్య జరిగిందా…అన్న కోణం లో దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు పోస్టుమార్టమ్ జరిపాకే మరికొన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు