ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో అక్రమాలను నియంత్రించేందుకు ఓటర్ ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేయమంటోంది కేంద్రం. ఈ లింక్ కు సంబంధించి కేంద్రం విధించిన గడువు ఈ నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో బుధవారం మరోసారి ఆ గడువును పెంచుతూ కేంద్ర న్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
దీని ప్రకారం ఈ గడువు 2023 ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకూ పెరిగింది. దీంతో మరో ఏడాది పాటు ఆధార్-ఓటరు కార్డు లింక్ చేసుకునేందుకు ప్రజలకు మరో అవకాశం దొరికింది. ఓటర్ కార్డు కలిగిన వారు ఆన్ లైన్ లోనే ఈ ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. స్వచ్ఛందం ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు.
ఎలక్షన్ కమిషన్ ప్రకారం చూస్తే.. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ద్వారా చాలా బోగస్ ఓట్లను గుర్తించొచ్చు. అంటే ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే.. అవి రద్దు అవుతాయి. గత ఏడాది డిసెంబర్ వరకూ కేవలం 54 కోట్ల మంది వివరాలు మాత్రమే సేకరించారు. వీటి అనుసంధానం పూర్తి కాకపోవడం, కొత్తగా సేకరించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి లింకింగ్ గడువు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా మరోవైపు పాన్ కార్డును సైతం ఆధార్ తో లింక్ చేసేందుకు విధించిన గడువు కూడా ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో దాన్ని కూడా పెంచాలని విపక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇందుకు సంబంధించి ప్రధాని మోడీకి ఓ లేఖ రాసింది. పాన్-ఆధార్ అనుసంధానానికి విధిస్తున్న రూ.1000 ఛార్జ్ ను కూడా ఎత్తివేయాలని కోరింది. 2023 మార్చి 31లోగా పాన్ తో ఆధార్ లింక్ చేయకపోతే.. వారి పాన్ కార్డులు అసలే పని చేయవు.