బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఏడంతస్తుల భవనంలో మంగళవారం సాయంత్రం సంభవించిన పేలుడులో 15 మంది మరణించగా సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు. స్థానికంగా జనాల రద్దీతో కూడిన సిద్ధిక్ బజార్ లో గల ఈ భవనంలో పలు కార్యాలయాలు, దుకాణాలు ఉన్నాయి.
పేలుడులో గాయపడినవారిని సహాయక బృందాలు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. మంటలను ఆర్పేందుకు 11 కి పైగా ఫైరింజన్లు కొన్ని గంటల పాటు శ్రమించాయి.
ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో శానిటేషన్ మెటీరియల్ ని అమ్మే స్టోర్ లో మొదట పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు కారణాలు తెలియలేదు.
క్షతగాత్రుల్లో చాలామంది తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని భయపడుతున్నారు. పేలుడు ధాటికి దగ్గర లోని ఓ బస్సు,కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.