ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో గతనెల జరిగిన 19 ఏళ్ళ అంకితా భండారీ హత్యకేసుకు ఆ రిసార్ట్ మౌన సాక్షిగా నిలిచింది. ఒకప్పుడు ఆమె పని చేసిన ఈ రిసార్ట్ ఇప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో ‘బిక్కుబిక్కుమంటోంది’. ఇక్కడ కనీసం ఒక నెల జీతం తీసుకోకుండానే ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. లోగడ బిజినెస్, పాలిటిక్స్ రెండూ కలిసిన కేంద్రంగా ఉన్న దీనివైపు ఇప్పుడు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. గత నెల 18 న బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య కొడుకైన పుల్కిత్ ఆర్యను, మరో ఇద్దరిని ఈ మర్దర్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ రిసార్టుకు వచ్చే గెస్టులకు ‘స్పెషల్ సర్వీసులను’ అందించాలన్న దీని యజమాని పుల్కిత్ కోర్కెను అంకిత అంగీకరించకపోవడంతో ఆమెను హతమార్చి ఆమె డెడ్ బాడీని దగ్గరలో ఉన్న కాలువలోకి విసిరేసినట్టు ఇతనిపై ఆరోపణలున్నాయి. ఇప్పటికీ తన కుమార్తె స్మృతులను తలచుకుని ఆమె తండ్రి, ఆమె కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ హత్య అనంతరం ఆ గ్రామవాసులు ఆగ్రహంతో రిసార్టును తగులబెట్టగా చాలా భాగం దగ్ధమైపోయింది.
సుమారు రెండు నెలల క్రితం వరకు ఈ ప్రాంతం వచ్చీ పోయేవారి కార్లతో బిజీగా ఉండేది. అప్పుడు వినోద్ ఆర్య బీజేపీ నేత కావడంతో ఆ పార్టీ జెండాలతో వచ్చే వాహనాలతో నిండిఉండేది.
రిసార్ట్ వద్ద ‘స్వదేశీ ఆయుర్వేద’ అనే బోర్డు వారికి స్వాగతం పలికేది. ఆర్యన్ కుటుంబం ఆధ్వర్యంలోని ఈ సంస్థను ఆయన భార్య నిర్వహించేది. కానీ అంకిత హత్య అనంతరం ఇప్పుడా ప్రాంతమంతా నిశ్శబ్దం అలుముకొని ఉంది. దాదాపు శిథిలావస్థ లో ఉన్న రిసార్ట్ పూర్తిగా మూగబోయింది. ఇది మూత బడడంతోను, స్వదేశీ ఆయుర్వేద సంస్థకు కూడా సీలు పడడంతోను వీటిలో పనిచేస్తూ వచ్చిన చిన్నా, చితకా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి పొందిన వీళ్ళు ఇప్పుడు చేతిలో రూపాయి లేక తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లలేక ఉసూరుమంటున్నారు.