హైదరాబాద్ వనస్థలిపురంలోని క్రిస్టియన్ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. అందుకు అత్తింటి వారి వేదింపులే కారణం అని ఆరోపిస్తూ.. బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వేళ్తే.. వనస్థలిపురంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన దేవిరెడ్డి అనే యువకుడితో.. మానసకు 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్ళైన కొద్ది రోజుల నుంచే మానసను తన భర్త దేవిరెడ్డితో పాటు.. అత్త, మామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితురాలి బంధువులు.
మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి.. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దేవాలయానికి వెళ్లిన మానస.. ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అత్తింటి వారి వేధింపులతో ఒత్తిడికి గురై మానస మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
Advertisements
కాగా.. భర్త ఇంటి ముందు మానస మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. వేధింపులకు కారణం అయిన ఇంటిలోనే శవాన్ని పూడ్చిపెడతామని ఇంట్లో గుంతలు తవ్వారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే.. వేధింపులకు సంబంధించి మానస గతంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని.. అప్పటి నుండి ఇంకా ఎక్కువ అయ్యాయంటున్నారు బాధిత బంధువులు.