కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వరుపుల రాజా హఠాన్మరణం చెందారు. వరుపుల జోగి రాజు అలియాస్ రాజాకు గుండెపోటు రావడంతో ప్రత్తిపాడు నుంచి హుటాహుటిన కాకినాడ అపోలో ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకోగానే రాజు కుప్పకూలారు.
వెంటనే వైద్యం ప్రారంభించినా ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు. 47 ఏళ్ళ రాజాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సాలూరు, బొబ్బిలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ తరపున పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ మధ్యాహ్నం ప్రచారం ముగించుకొని శనివారం సాయంత్రం ప్రత్తిపాడు చేరుకున్నారు.
కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో పలు విషయాలపై మాట్లాడుతుండగా.. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కాకినాడకు తరలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకోగానే రాజా కుప్పకూలిపోయారు. రాజా స్వగ్రామం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి. తాత జోగిరాజు 1972 లో ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఐదు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కుటుంబం వీరిది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా , అప్కాబ్ వైస్ ఛైర్మన్ గా సేవలు అందించారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజా ప్రస్తుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పై ఓటమి పాలయ్యారు.
అప్పటి నుంచి ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఆయన గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొనేవారు.