టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపంలో మరణించినవారి సంఖ్య 25 వేలకు పైగా పెరిగింది. దాదాపు 100 గంటలుగా శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుకుని ఉన్నారు. బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు ఇప్పటికీ శ్రమిస్తున్నాయి. ఈ శతాబ్దంలోనే పెను ఉపద్రవంగా ఈ ఘోరకలిని భావిస్తున్నారు.
ఇండోనేసియా, క్యూబా కూడా తమ వంతు సాయం చేయడం ప్రారంభించాయి. చలి, ఆకలి, లక్షలాది మందిని బాధిస్తున్నాయి. నిరాశ్రయులై అల్లాడుతున్నారు. హతయ్ ప్రావిన్స్ లో 90 గంటలు శ్రమించాక రక్షణ బృందాలు ఓ పదేళ్ల బాలుడిని, అతని తల్లిని రక్షించాయి.
ఇదే ప్రావిన్స్ లోనే 95 గంటల అనంతరం ఏడేళ్ల చిన్నారిని, ఖహ్రామన్ మరస్ లో 119 గంటల తరువాత ఓ టీనేజీ కుర్రాడిని కాపాడారు. ఇన్ని రోజులూ ఈ బాలుడు తన మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్నాడట..
అయితే ఇంకా వేలమందిని రక్షించలేక సహాయక బృందాలు దాదాపు చేతులెత్తేయడంతో వారికి సంబంధించి ఆశలు సన్నగిల్లుతున్నాయి. సిరియా లోను ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. రాత్రుళ్ళు దట్టమైన చీకటి లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియా, అమెరికా, రష్యా, నాటో దేశాల నుంచి టర్కీ, సిరియాలకు సాయం అందుతూనే ఉంది.