గ్రీస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 57 కు చేరింది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి దేశవ్యాప్తంగా ప్రజలు పూల బొకేలతో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇక ప్రమాదం జరిగిన మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైళ్ల శకలాలను భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు. అయితే మంగళవారం అర్థరాత్రి ప్యాసింజర్ రైలు,గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ఘటనలో స్పాట్ లోనే 36 మంది మరణించారు. 85 మంది గాయపడ్డారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే క్షతగాత్రుల్లో చాలా మంది ప్రాణాలు వదిలేయడంతో మృతుల సంఖ్య 57 కు చేరింది. ఏథెన్స్ కు ఉత్తరాన 380 కి.మీ దూరంలో ఉన్న లారిస్సా నగరానికి సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
అత్యంత వేగంతో రైళ్లు ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయి. ముందున్న మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో 36 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్ధం వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 25 మందిని సమీపంలోని లారిస్సా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.