తెలంగాణ సీఎం కేసీఆర్ ను నమ్మడానికి లేదు.. ఈసారి కూడా ముందస్తుకు వెళ్తే ఛాన్స్ ఉంది. ఇది.. కొద్దిరోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. లెక్క ప్రకారం చూస్తే 2023 డిసెంబర్ నాటికి ఐదేళ్లు అవుతుంది. అయితే.. కేసీఆర్ తీరు చూస్తుంటే.. ఈ ఏడాది డిసెంబర్ కు గానీ.. 2023 మార్చి నాటికి గానీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అదే నిజమైతే.. చాలామంది ప్రతిపక్ష నేతలకు ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
హుజూరాబాద్ బైపోల్ అత్యంత కాస్ట్లీ ఎన్నిక అని చెబుతుంటాయి ప్రతిపక్షాలు. దాని ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై కూడా ఉండొచ్చనేది విశ్లేషకుల వాదన. అంటే నగదు ప్రవాహం మామూలుగా ఉండదన్నమాట. అయితే.. అధికార పార్టీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ప్రతిపక్ష నేతలకే డబ్బుల కోసం తంటాలు తప్పదంటున్నారు విశ్లేషకులు. కరోనా కారణంగా చాలామంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా నష్టాలు చవిచూశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తే కొందరికి తిప్పలు తప్పవని చెబుతున్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు తెగ కంగారు పడుతున్నారు. ఖర్చును భరించే మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు ఆస్తుల అమ్మకంపై దృష్టి పెట్టగా.. మరికొందరు తమకు తెలిసిన వారి దగ్గర నుంచి నిధులను సమీకరిస్తున్నారు. మరికొందరైతే వడ్డీ వ్యాపారులను కూడా సంప్రదిస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు.
మరోవైపు ఎన్నికల్లో అత్యధికంగా డబ్బుల ఖర్చు వర్కవుట్ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా, అనధికారికంగా వందల కోట్లు కుమ్మరించిందని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 500 కోట్ల దాకా ఖర్చు చేశారని ఈటల రాజేందర్ తరచూ విమర్శలు చేస్తుంటారు. అయితే.. టీఆర్ఎస్ నేతల మాదిరి ప్రతిపక్ష నాయకులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా గులాబీ నేతలు అధికంగా డబ్బు ఖర్చు చేసే ఛాన్స్ ఉందని.. వారు ఎంత కుమ్మరించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.