బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రస్తుత మార్గదర్శకాలను సమూలంగా మారుస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. డెబిట్, క్రెడిట్ కార్డుల జారీపై కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మార్గదర్శకాలు జూలై 1 నుంచి వర్తిస్తాయని ఆర్‌బీఐ తన ఆర్డర్‌లో పేర్కొంది.
ఇందులో భాగంగా కస్టమర్ల స్పష్టమైన అనుమతి లేకుండా ఇష్టపూర్వకంగా కార్డులు జారీ చేయవద్దని, ఇప్పటికే ఉన్న కార్డును అప్‌గ్రేడ్ చేయవద్దని సంబంధిత సంస్థలకు సూచించింది. అలా చేస్తే బిల్ చేసిన మొత్తానికి రెట్టింపు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ఆయా సంస్థలను హెచ్చరించింది.
కాగా, ప్రస్తుత ఆదేశాల ప్రకారం.. బ్యాంకులకు రూ. 100 కోట్ల నికర విలువ ఉంటే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని స్వతంత్రంగా లేదా ఇతర కార్డు జారీ చేసే బ్యాంకులతో టై-అప్ ఏర్పాటుతో చేపట్టేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. నికర విలువ కలిగిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను క్రెడిట్ కార్డ్ వ్యాపారాలను స్థాపించడానికి అనుమతించింది. అయితే, అటువంటి యూసీబీలకు కోర్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ ఉండాలని తెలిపింది. అలాగే, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి యూసీబీలకు అనుమతి లేదని పేర్కొంది.
ఇక, రూ. 1000 కోట్ల నికర విలువ కలిగిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇప్పుడు తమ స్పాన్సర్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల సహకారంతో క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి అనుమతించబడ్డాయి. డెబిట్ కార్డుల జారీకి సంబంధించి, బ్యాంకులు డెబిట్ కార్డు సదుపాయాన్ని పొందమని ఖాతాదారుని బలవంతం చేయకూడదని తెలిపింది.