తెలంగాణలో మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈక్రమంలోనే అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరప్లలి మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
మృతుని కుంటుంబ సభ్యుల ప్రకారం.. పెంట కుమారస్వామి ములుకనూరు సహకార సంఘంలో డ్రైవర్ గా పనిచేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. గ్రామంలో తనకున్న రెండు ఎకరాల భూమిలో పత్తి, వరి పంట సాగు చేస్తున్నాడు. ఇటీవల తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన రెండు బోర్ లలో నీరు పడకపోవడంతో 3 లక్షల వరకు అప్పు చేశాడు.
వేసిన పంటల ద్వారా తగిన ఆదాయం రాకపోవడం, చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఒత్తడితో మనస్థాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి క్రిమసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బావి వద్దకు వెళ్లి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించాడు.
వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.