సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో డెక్కన్ మాల్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం డెక్కన్ మాల్ ను కూల్చి వేస్తుండగా.. పెను ప్రమాదం తప్పింది. డెక్కన్ మాల్ భవనాన్ని భారీ యంత్రంతో కూల్చివేస్తుండగా.. ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఇండ్లలోని వారిని భవనం కూల్చివేత కంటే ముందే అధికారులు ఖాళీ చేయించారు. భవనం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
డెక్కన్ మాల్ కూల్చివేత పనులు గురువారం నుంచి కొనసాగుతున్నాయి. చుట్టు పక్కల బిల్డింగ్ లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో కూల్చివేస్తున్నారు. డైమండ్ కటింగ్ తో ఒకేసారి భవనం కూప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం ఈ యంత్రం ప్రత్యేకత.
తొలుత భవనం చుట్టూ 125 మైక్రాన్ మందంతో ప్లాస్టిక్ షీట్ ఏర్పాటుకు రూ. 26 వేలు, కూల్చివేత సామాగ్రికి దాదాపు రూ. 11 లక్షలు, వ్యర్థాల తరలింపునకు రూ. 22 లక్షలు కలిపి మొత్తం రూ.33.86 లక్షల అంచనా టెండర్ ను పిలవగా, రూ.25. 94 లక్షలకు ఎస్‌కె మల్లు అనే ఎజెన్సీ ఈ పనులను టేకప్ చేసింది.
కాగా ఈ భవన ప్రమాద సమయంలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. భవనం ఫస్ట్ ఫ్లోర్ లో ఎముకల అవశేషాలు కనిపించాయి. క్లూస్ టీమ్ సభ్యులు వాటిని డీఎన్ఏ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే దొరికిన ఎముకల అవశేషాలు ఒకరివా? లేక ముగ్గురివా? అన్న అంశాన్ని అంచనా వేయలేకపోతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వస్తే అసలు విషయాలు బయట పడతాయి.