సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఆధునిక సాంకేతికత ఉపయోగించి భవనం కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు గుర్తించిన తర్వాతే భవనం కూల్చివేయనున్నట్లు అధికారులు సూచించారు. ఈ భవన కూల్చివేతకు రోబోటిక్ టెక్నాలజి వాడనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
చుట్టపక్కల ఇళ్ళకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భవనం లోపల 10వేల టన్నులు వ్యర్థాలను క్రేన్ల సాయంతో ముందు భాగం నుంచి వ్యర్థాలను తొలగించారు. ఈ మాల్ కూల్చివేయడానికి అయ్యే ఖర్చు యజమానుల వద్ద వసూలు చేస్తామని జీహెఎచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
అయితే శనివారం భవనంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. ఫస్ట్ ఫ్లోర్ లో పూర్తిగా కాలిన ఓ వ్యక్తి అస్థి పంజరం లభ్యమైంది. దుకాణం సిబ్బందిలో ఒకరు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. మంటల సమయంలో ముగ్గురు లోపలికి వెళ్లారని ఇతర సిబ్బంది తెలిపారు. దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు వెళ్లారని చెబుతున్నారు.
కాగా గురువారం సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. 5 అంతస్తుల భవనం, పెంట్ హౌజ్ లో డెక్కన్ నైట్ వేర్ పేరిట క్రీడా సామగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే మంటలు వ్యాపించాయి. దీంతో సెల్లార్ లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమ క్రమంగా మంటలు చెలరేగాయి. సమీపంలోని మరో నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎట్టకేలకు 20 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.