ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అసని తుపాను.. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు.. కాకినాడకు 150 కిలోమీటర్లు.. విశాఖకు 310 కిలోమీటర్లు.. గోపాలపూర్ కు 530 కిలోమీటర్లు.. పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను.. దిశ మార్చుకుని పశ్చిమవాయవ్య దిశగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి రానున్న తుపాన్.. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అసని తుపాను తీరానికి అతిదగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గి.. గంటకు 75-95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు అధికారులు.
అసని తుపాను కారణంగా 3 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయని వివరించారు. తుపాన్ ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు.. పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే కోస్తా జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు అధికారులు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే మెరైన్ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను రక్షిత భవనాలను సిద్ధంగా ఉంచారు. కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల రక్షిత భవనాలను అందుబాటులోకి తీపుకొచ్చారు. నిజాంపట్నం హార్బర్ లో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలను సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వివరించారు.