టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెట్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తాకుతోంది. ఇప్పటికే ఆటగాళ్లు రవీంద్ర జడేజా, బుమ్రాలు ఈ టోర్నీకి దూరమయ్యారు. తాజాగా ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా జట్టు నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. గాయం కారణంగా ఆయన టీ 20 వరల్డ్ కప్ కు దూరం కానున్నట్టు సమాచారం.
గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు చాహర్ దూరమయ్యారు. అయితే కనీసం టీ20 ప్రపంచకప్ వరకైనా కోలుకుంటాడని అంతా భావించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
బుమ్రా, దీపక్ చాహర్ స్థానాల్లో మహమ్మద్ షమీ, సిరాజ్ లు జట్టులో చేరతారని తెలుస్తోంది. వీరిద్దరిలో ప్రధాన జట్టులోకి ఎవరు వస్తారనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వారితో పాటు శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఆస్ట్రేలియాకు పంపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ 23న తొలి మ్యాచ్ లో పాక్ తో టీమిండియా తలపడనుంది. చాహర్ ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. తాజాగా వెన్ను నొప్పి మరోసారి తిరగబెట్టినట్టు కనిపిస్తోందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అందుకే ముగ్గురు ఆటగాళ్లను ఆస్ట్రేలియాకు పంపించనున్నట్టు పేర్కొన్నాయి.