బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తమిళనాడులో నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను ఆమె వివరించారు. మానసికంగా మనం బలంగా ఉండటంలో మన కుటుంబ పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. తన విషయంలో తనకు తన తల్లి ఎప్పుడూ తోడుగా ఉందన్నారు. ఓ వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆ సమయంలో సంరక్షకులు దగ్గరుండి అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
తన విషయాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. తన మనసు బాగా లేనప్పుడు తన తల్లి గుర్తించిందన్నారు. లేకపోతే తాను ఏమో పోయేదానినో అని తెలిపారు. తన తల్లి గుర్తించడం వల్లే మానసిక వైద్య నిపుణులను సంప్రదించానన్నారు. వైద్యుల సలహాను పాటిస్తూ క్రమం తప్పకుండా చికిత్స పొందానన్నారు.
తాను బెంగుళూర్‌లో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు వచ్చినప్పుడల్లా ఎలాంటి సమస్యలు లేనట్టుగానే నటించే ప్రయత్నం చేసేదానినన్నారు. కానీ, ఓ రోజు తన తల్లి ఆ విషయాన్ని గుర్తించి నిలదీసిందన్నారు. తన పరిస్థితిని గమనించి ఏమైంది.. ఎందుకలా ఉన్నావంటూ తన తల్లి ప్రశ్నించారని తెలిపారు. దీంతో తన పరిస్థితిని ఆమె పూర్తిగా వివరించినట్టు చెప్పారు. ఆ సమయంలో తన తల్లిని ఆ దేవుడే పంపించాడని అనిపించిందన్నారు.