బ్రెజిల్ లో మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సనారో మద్దతుదారులు రాజధాని బ్రెసీలియాలో జరిపిన విధ్వంసం దురదృష్టకరమని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం ఈ నగరంలో వందలాదిమంది ఇక్కడి నేషనల్ కాంగ్రెస్, అధ్యక్ష భవనం, చివరకు సుప్రీంకోర్టు లోకి కూడా చొరబడి పెను విధ్వంసానికి పాల్పడ్డారు. కోర్టులోని గదుల్లో వస్తువులను చిందరవందర చేశారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేక నినాదాలు చేశారు.
దాదాపు రెండేళ్ల క్రితం వాషింగ్టన్ లోని యుఎస్ కేపిటల్ భవనంపై నిరసనకారుల దాడిని ఇది గుర్తుకు తెచ్చింది. ఈ పరిణామాలు తననెంతో కలవరపరిచాయని పేర్కొన్న మోడీ.. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. అధ్యక్షుడు సిల్వాను ట్యాగ్ చేస్తూ.. బ్రెజిల్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
బ్రెసీలియాలో జరిగిన అల్లర్ల సందర్భంగా ఎవరూ మరణించడం గానీ, గాయపడడం గానీ జరగలేదని, అయితే పోలీసులు సుమారు 400 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అధ్యక్షుడిగా సిల్వా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల తరువాత పెద్దఎత్తున గుంపులు ఈ అల్లర్లకు పాల్పడ్డాయి. అక్టోబరు 30 న జరిగిన ఎన్నికలో బొల్సనారోను సిల్వా ఓడించారు.
అయితే ఈ ఎన్నిక ఫలితాలను బొల్సనారో సవాలు చేశారు. అధికారాన్ని అప్పగించడంలో సహకరిస్తానని చెబుతూనే.. తన ఓటమిని అంగీకరించడానికి ఆయన ఇష్టపడలేదు. ఆదివారం జరిగిన దాడులను సిల్వా ఖండిస్తూ.. నిరసనకారులను ఫాసిస్టులుగా అభివర్ణించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ నాయకులు కూడా ఈ దాడులను ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. బ్రెజిల్ లోని ప్రజాస్వామ్య సంస్థలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.