తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా దళాల నుంచి ఏ క్షణమైనా ముప్పు రావచ్చునని భావిస్తున్న ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. అక్కడ జవాన్లకు అవసరమైన సదుపాయాలను, ఆయుధ సంపత్తిని పెంచింది. కీలకమైన ఈ సెక్టార్ లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలు పెరుగుతున్న దృష్ట్యా ఇండియా అదనంగా వేలాది ట్రూపులను, అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సిద్ధంగా ఉంచినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. రెండున్నర ఏళ్ళ క్రితం ఇక్కడ భారత-చైనా బలగాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సుమారు 18 వేల అడుగుల ఎత్తున కూడా తాజాగా భారత బలగాలను మోహరిస్తున్నట్టు ఈ వర్గాలు తెలిపాయి. ట్యాంకులు, ఆర్టిల్లరీ తుపాకులు ఏ క్షణమైనా గర్జించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధాల స్టోరేజీకి అండర్ గ్రౌండ్ సౌకర్యాలు పెంచారు.. ఎయిర్ ఫీల్డ్స్ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు..
అభేద్యమైన మార్గాల్లో కొత్తగా రోడ్లు, టనెల్స్ నిర్మిస్తున్నారు. జవాన్లకు అవసరమైన మంచినీటిని సరఫరా చేసేందుకు ఎత్తయిన ప్రదేశాల్లో ఆర్మీ చెరువుల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. పైగా లడఖ్ వద్దే కాకుండా ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సైన్యానికి అవసరమైన సదుపాయాలను పెంచుతున్నట్టు ఈ వర్గాలు వివరించాయి. 2020 మే నెలలో ఘర్షణ పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన డిఫెన్స్ ఇన్-ఫ్రాస్ట్రక్చర్ ని గణనీయంగా పెంచినట్టు ఇవి తెలిపాయి.
అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అత్యాధునిక యాంటీ ఆర్మర్ లాయిటర్ సిస్టమ్స్ ని కనీసం 180 వరకు పంపాలని కోరేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు సైన్యం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా డ్రోన్ డిటెక్షన్ సిస్టంలు వంటివి కూడా ఉన్నట్టు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. చైనాతో గల సరిహద్దు ప్రాంతంలో ఆధునిక బంకర్ల నిర్మాణానికి కూడా పూనుకొంటున్నారు.