ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మాట్లాడటం సాధారణమైన విషయం కాదు. ఆయన పాల్గొనే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కూర్చొవడంతో పాటు ఆయన ఎదురుగా మాట్లాడే అవకాశాన్ని కొట్టేసింది తెలంగాణలోని సిద్ధిపేట కు చెందిన ఓ యువతి. శ్రీ వర్షిణి అనే డిగ్రీ విద్యార్థిని సోమవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మోడీ సమక్షంలో మాట్లాడనుంది.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 27 మంది యువతీ యువకులను ఎంపిక చేస్తే అందులో ఒకరిగా శ్రీ వర్షిణి ఎంపికైంది. జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. అటు తరువాత రాష్ట్ర స్థాయిలో కూడా పోటీల్లో ముందుండటంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యింది.
ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి, కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్ శ్రీ వర్షిణికి జాతీయ స్థాయి ఆహ్వాన పత్రం, విమాన టికెట్స్ అందించారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థినికి మోడీ సమక్షంలో మాట్లాడే అవకాశం దక్కడం తమ కాలేజ్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణమన్నారు.
తాను జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడం పట్ల వర్షిణి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇలాంటి అవకాశం అందరికీ రాదని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే విద్యార్థుల ప్రతిభ కనిపిస్తుందని ఆమె అన్నారు.