ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారంటూ మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు.
మన జాతీయ స్ఫూర్తిపై కొన్ని పార్టీలు ప్రత్యక్ష దాడికి పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసే మన దేశ పౌరులపై ఆ పార్టీలు తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నాయని తెలిపారు.
దేశ పౌరులకు ఈ మేరకు ఆయన సోమవారం బహిరంగ లేఖ రాశారు. 2047లో భారతదేశం కోసం ముందస్తుగా ఆలోచించి ప్రణాళికను సిద్ధం చేయాలని పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మనం 100 ఏండ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకున్నప్పుడు దేశం ఎలా ఉంటుందో ప్రణాళిక వేయాలని ఆయన దేశప్రజలను కోరారు.
రాజస్థాన్ కరౌలీలో జరిగిన అవమానకరమైన సంఘటనలను మన ప్రతిపక్ష నాయకులు ఎందుకు మరిచిపోయారని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రతిపక్షాల మౌనంపై ఆయన ప్రశ్నలు వేశారు.
దేశంలోని యువతకు అవకాశాలు కావాలి, అవరోధాలు కాదన్నారు. వారికి అభివృద్ధి కావాలని కానీ విభజనలు కాదని తెలిపారు. ప్రతిపక్షాలు వాటి మార్గాన్ని మార్చుకోవాలని సూచించారు.