తెలంగాణ రాష్ట్రంలో హార్టీకల్చర్ (ఉద్యాన) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. చాలా కాలంగా ఉద్యాన విస్తరణ అధికారుల పోస్టుల భర్తీలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. శ్రీ కొండా లక్ష్మణ్ హార్టీకల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు క్లాసులను బహిష్కరించి నిరసనకు దిగారు. 20 ఏళ్లుగా హెచ్ఈవో పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వ్యవసాయశాఖ తరహాలో ప్రతీ నెల 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ కి ఏఈవోని నియమించినట్లే, ఉద్యాన శాఖలోనూ ప్రతీ నెల 5 వేల ఎకరాలకు ఒక హెచ్ఈవోని నియమించాలని డిమాండ్ చేశారు. దాదాపు 650కి పైగా హెచ్ఈవో పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా టీఎస్ పీఎస్సీలో కొండా లక్ష్మణ్ హార్టీ కల్చర్ యూనివర్సిటీ పేరు నమోదు కాలేదని గ్రాడ్యుయేట్స్ వాపోతున్నారు.
విద్యార్థులు రెండు రోజులుగా తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ స్పందించింది. త్వరలోనే వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్ పీఎస్సీతో ఉద్యాన వర్సిటీ సంప్రదింపులు జరుపుతోంది. కొత్తగా హెచ్ఈవో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టింది.