రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటలో అల్లర్లకు కారణమైన వారి ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా పంజాబీ నటుడు దీప్ సిద్ధూను పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో అతనిపై రూ. లక్ష రివార్డు ప్రకటించారు. సిద్దూతో పాటు జెండా ఎగురవేసిన జుగ్‌రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్‌పై రూ. లక్ష.. ఇక సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్, జాజ్బిర్ సింగ్, బూటా సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్రకటించారు.
ఎర్రకోటపై సిక్కు జెండా ఎగరవేసేందుకు సిద్ధూ.. నిరసనకారులను ప్రేరేపించారని పోలీసులు తమ విచారణలో తేల్చారు. కాగా అల్లర్లు జరిగిన రోజు నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న అతను.. ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇదిలా ఉంటే ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా 44 కేసులు నమోదు చేశారు. 122 మందిని అరెస్టు చేశారు.