దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తుంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఐదు రోజుల్లోనే 321 డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 321 మందికి డెంగ్యూ ఫీవర్ సోకినట్లు నమోదైంది.
సెప్టెంబర్ నెలలో ఈ వ్యాధి బాగా వ్యాపించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ నాటికి మొత్తం 693 డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇక ఢిల్లీలో ఈ ఏడాది జనవరి నుంచి నెలకు 20, 25 చొప్పున కేసులు నమోదవుతూ వచ్చాయి.
కానీ ఆగస్టులో ఉన్నట్టుండి 75 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఏకంగా 693 మందికి డెంగ్యూ వచ్చింది. ఈ నెలలో మొదటి ఐదు రోజుల్లోనే 321 కేసులు రికార్డయ్యాయి. నెలాఖరు వరకు మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
కాగా, ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మొత్తం 1258 మందికి డెంగ్యూ ఫీవర్ సోకింది. అయితే డెంగ్యూ బారినపడిన బాధితులంతా కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.