దిశ నిందితుల రీపోస్టుమార్టం నివేదిక హైకోర్టుకు అందింది. రీపోస్ట్‌మార్టం కోసం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల ప్రత్యేక బృదం హైదరాబాద్ చేరుకొని రీపోస్ట్‌మార్టం నిర్వహించింది. ఈ మొత్తాన్ని వీడియో తీసి, ఆ సీడీని హైకోర్టుకు అందజేశారు. అయితే తాత్కాలిక నివేదికను మాత్రమే ఇప్పుడు అందజేయగా… మూడు నాలుగు రోజుల్లో సమగ్ర రిపోర్ట్ ఇస్తామని వైద్యుల బృందం కోర్టుకు తెలిపింది.
రీపోస్ట్‌మార్టం చేసేప్పుడు మృతదేహాలు ఎలా ఉన్నాయి, తమతో మృతుల కుటుంబాలు చెప్పిన అంశాలు, మృతి చెందిన సమయంలో వారి పరిస్థితి ఏంటీ…? వంటి అంశాలను సమగ్ర నివేదికలో పొందుపర్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసులో సుప్రీం కోర్టు వేసిన త్రిసభ్య కమీషన్ కేసును ఎలా దర్యాప్తు చేయాలో కమీషన్ సభ్యులు చర్చించారు. జనవరి రెండో వారంలో కమీషన్ హైదరాబాద్ చేరుకోబోతుంది. ఇప్పటికే తమకు కావాల్సిన సౌకర్యాలపై కమీషన్ సభ్యులు తెలంగాణ సీఎస్ ఎస్.కే జోషికి లేఖ రాశారు. కమీషన్ విచారణలో మొదటి, రెండో పోస్ట్‌మార్టం నివేదికలు కీలకం కాబోతున్నాయి. ఇటు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులతోపాటు పోలీస్‌బాస్‌ను, ఎన్‌కౌంటర్ ప్లేస్‌ను, నిందితుల కుటంబాలతో కూడా కమీషన్ చర్చించే అవకాశం ఉంది.