ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గు ముఖం పట్టాయి. కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే పోస్ట్ కొవిడ్ సమస్యలు మాత్రం ప్రజలను వెంటాడుతున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న వారిలో చాలామంది పలు రకాల సమస్యలతో బాధపడుతున్నారు.
కరోనాకు ముందు కిలోమీటర్ల కొద్దీ వాకింగ్ చేసిన వారు ఇప్పుడు కేవలం 400 నుంచి 500 మీటర్లు వాకింగ్ చేస్తేనే తీవ్రంగా అలిసి పోతున్నారు. చాలా మంది నిద్రలేమి, జుట్టరాలడం, శ్వాస సరిగా ఆడకపోవడం,కీళ్ల, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది.
న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ బృందం కొవిడ్ అనంతర పరిస్థితులపై ఓ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలోని అంశాలను డోవ్ ప్రెస్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.
అధ్యయనంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా మొదటి, రెండో వేవ్‌లో వైరస్ బారినపడి కోలుకున్న వారిని ఎంపిక చేశారు. వారి దినచర్యపై వారితో చర్చించారు. 2020-2021లో ఆస్పత్రిలో చేరిన తర్వాత వారి జీవితంలో పూర్తిగా మార్పులు వచ్చినట్టు గుర్తించారు.
ఓ వ్యక్తి కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ అతను ఎనిమిది గంటలు మించి పని చేయడం కష్టతరంగా మారినట్లు గుర్తించారు. ఈ అధ్యయనం ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పర్యవేక్షణలో జరిగింది. ఇందులో పలు రాష్ట్రాలకు చెందిన 1800 మందిని ఎంపిక చేసి, వారితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రస్తుత దినచర్యకు సంబంధించి వారిని పలు ప్రశ్నలు వేశారు. ఇందులో తకు అలసటగా ఉంటోందని 79.3శాతం, కీళ్ల నొప్పులంటూ 33.4శాతం మంది, గౌట్ 29.9శాతం , జుట్టు రాలడం 28శాతం ,తలనొప్పి, 27.2శాతం, శ్వాస ఆడకపోవడం 25.3శాతం, నిద్రలేమి సమస్యలతో 25.30శాతం మంది బాధపడుతున్నట్లు వివరించారు.
కరోనా మహమ్మారి బారిన పడిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలా మంది యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అధ్యయనం తెలిపిన వివరాల ప్రకారం.. 12 వారాల్లో పోస్ట్ కొవిడ్ 12.8 శాతానికి తగ్గింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చేందాయని, దీంతో పాటు సంక్రమణను వ్యాక్సిన్ నిరోధించిందన్నారను. అంతే కాకుండా.. పోస్ట్ కోవిడ్‌గా అనుమానించిన వారిలో 39శాతం మందిలో లక్షణాలు పెరుగకుండా కాపాడబడినట్లు అధ్యయనం ధ్రువీకరించింది.