యూకేలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని మళ్లీ భయం గుప్పిట్లోకి నెడుతోంది. గతంలో చైనాను చూసి వణికిపోతే.. ఇప్పుడు బ్రిటన్ పేరు వింటేనే దేశాలు గజగజమంటున్నాయి. అందుకే మరో ఉపద్రవం ముంచుకు రాకముందే…అనేక దేశాలు బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి.ఇండియా కూడా బుధవారం నుంచి ఈ నెల 31 వరకు విమానసేవలను రద్దు చేసింది. అయితే ఇంతలోనే ఇండియాలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేగింది.
రాత్రి లండన్ నుంచి 266 మందితో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన విమానంలో ఐదగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలవరపరుస్తోంది. దీంతో వారిలో ఎవరికైనా కొత్త రకం వైరస్ అటాక్ అయి ఉంటుందా అన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నిర్ధారణ అయిన ఆ ఐదుగురి శాంపిళ్లను పరిశోధన కోసం NCDCకి పంపారు అధికారులు. పాజిటివ్ నిర్ధారణ అయిన ఐదుగురిని కరోనా కేర్ సెంటర్‌కి తరలించారు. కాగా యూకేలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 60 శాతం కొత్త రకం కరోనా వైరస్ కేసులేనని అక్కడి ప్రభుత్వం చెప్తుండటంతో.. లండన్ నుంచి ప్రయాణికుల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది.