దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 1.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు 2,700 పోలింగ్ స్టేషన్లలో 13000 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. పోలింగ్ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు పారా మిలిటరీ దళాలను రంగంలోకి దించారు.సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా నిరసన దీక్ష చేస్తోన్న షహీన్ బాగ్ లో అదనపు బలగాలను మోహరించారు. మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రతిష్టగా మారాయి. ఎన్నికల ప్రచారం ముగింపు దశలో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. 2015 లో 67 సీట్లు సాధించుకొని అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుంది. ఈ ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ది పనిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగారు.
కీలకమైన దేశ రాజధానిలో ఎలాగైన కాషాయం జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉన్నబీజేపీ కూడా గట్టిగానే ఉంది. గెలుపు కోసం పలు వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ ధిగ్గజాలు పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఏఏ, రామాలయ నిర్మాణం వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభ ఈసారి అంతంత మాత్రంగానే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తాను గెలిచేకంటే తన శత్రువు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి ఆప్ గెలుపుకు పరోక్షంగా సహకరిస్తోంది. తమ పార్టీ తరపున బలహీన అభ్యర్దులను రంగంలోకి దించింది.
ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలవ్వడానికి కొన్ని నిమిషాల ముందు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సోషల్ మీడియా ట్విట్టర్ లో కోరారు. ” తప్పకుండా ఓటేయండి…మహిళలకు ప్రత్యేకంగా విజ్ఙప్తి చేస్తున్నాను…మీ ఇంటికి బాధ్యత వహించినట్టే…దేశ బాధ్యత, ఢిల్లీ బాధ్యత మీపై ఉంది…మహిళలంతా తప్పకుండా మీ కుటుంబంలోని మగాళ్లందరిని ఓటే వేయడానికి తీసుకెళ్లండి…ఎవరు సరైన వారు..ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందో మీ మగాళ్లతో చర్చించండి” అంటూ ట్వీట్ చేశారు.
మహిళల ఓటింగ్ శాతాన్ని బట్టే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది… ఏ పార్టీ ఓడుతుందనేది తెలుస్తుంది. 2015 ఎన్నికల్లో 20 నియోజకవర్గాల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళల ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు అయిన స్థానాల్లో ఆప్ అభ్యర్ధులు భారీ విజయం సాధించారు.