తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని నగర బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన క్రిమినల్ అని, ఆయన తరఫున ఎవరో దాన్ని వినియోగిస్తున్నారని బీజేపీ నేత తేజేందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపించారు. ఈ అకౌంట్ ను బ్లాక్ చేయాలని .. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ని బగ్గా కోరారు.
లిక్కర్ పాలసీ కేసులో బీజేపీ తనను అరెస్టు చేసి జైలు పాల్జేయడాన్ని దుయ్యబడుతూ సిసోడియా ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ లు వెల్లువెత్తడంతో నగర బీజేపీ దీనిపై తీవ్రంగా స్పందించింది.
దేశంలో స్కూళ్లను ఓపెన్ చేసిన వారిని ఆ పార్టీ (బీజేపీ) జైళ్లకు పంపుతోందని, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఈ పోస్టుల్లో ధ్వజమెత్తారు. దీనిపైనే బగ్గా ఇలా స్పందించారు. జైల్లో ఉన్న సిసోడియా.. ఇలా ట్విట్టర్ ముఖంగా తమ పార్టీని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
ఇక సిసోడియా భద్రతపై ఆప్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జైల్లో ఆయన భద్రతకు ఢోకా లేదని, విపాసన సెల్ లో ఆయన ధ్యానం చేసుకోవచ్చునని జైలు అధికారులు మళ్ళీ స్పష్టం చేశారు. ఈ నెల 20 వరకు సిసోడియా తీహార్ జైల్లో ఉండనున్నారు. ఈ నెల 10 న ఆయన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు తీర్పునివ్వనుంది.