బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆమె కోర్టు ఎదుట హాజరయ్యారు. సుకేశ్ చంద్రశేఖర్, ఇతరులకు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమె కూడా ఒక నిందితురాలుగా ఉన్నారు.
సుకేశ్ ఆమెకు ఖరీదైన కార్లు, ఇతర వస్తువులు బహుమతులుగా ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేసులో ఆమెను ఈడీ విచారిస్తోంది. గతంలో ఈ కేసులో నిందితురాలుగా ఉన్న సుకేష్ భార్య లీనా మరియా పాల్ నుంచి 26 కార్లను స్వాధీనం చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి గతంలో ఇదే కోర్టు అనుమతులు ఇచ్చింది.
ఈ మనీలాండరింగ్ లో వచ్చిన డబ్బుతోనే ఈ కార్లను కొనుగోలు చేశారని, అందువల్ల దర్యాప్తు సమయంలో వాటిని అటాచ్ చేశామని ఈడీ పిటిషన్‌లో వెల్లడించింది. అంతకు ముందు 2021లో ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ తో పాటు అతని భార్య లీనా మరియా పాల్, ఇతరులతో సహా 14 మంది నిందితుల పేర్లను చేరుస్తూ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ప్రకారం.. సుకేష్ ఇతరులతో కలిసి లీనా హవాలా మార్గాలను ఉపయోగించారు. మనీలాండరింగ్ ద్వారా వచ్చి డబ్బును పెట్టుబడులుగా పెట్టేందుకు పలు షెల్ కంపెనీలను వారు సృష్టించారు. దీంతో 2021లో నిందితుడు చంద్రశేఖర్, అతని భార్య లీనా మారియా పాల్‌ను ఢిల్లీ పోలీసులు డూపింగ్ కేసులో పాత్ర పోషించినందుకు అరెస్టు చేశారు.