బడ్జెట్ విషయంలో కేంద్రానికి, ఢిల్లీ సర్కార్ కు మధ్య నెలకొన్న వార్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఢిల్లీ సర్కార్ రూపొందించి బడ్జెట్ కు కేంద్ర హోం శాఖ ఈ రోజు ఆమోద ముద్ర వేసింది. బడ్జెట్ ప్రవేశ పెట్టుకుండా కేంద్రం తమను అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి కేజ్రీవాల్ లేఖ కూడా రాశారు. 75 ఏండ్ల భారత చరిత్రలో తొలిసారిగా ఢిల్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా అడ్డుకుంటున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ప్రజలపై ఎందుకంత కోపమని ఆయన ప్రశ్నించారు.
బడ్జెట్ ను ఆమోదించాలని ఢిల్లీ ప్రజలు చేతులెత్తి వేడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కొద్ది సేపటికే బడ్జెట్ కు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు విషయాన్నిలెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. దీంతో కేంద్రం, ఆప్ సర్కార్ మధ్య ఘర్షణ సద్దు మణిగింది.
ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటనలకు ఎక్కువ, మిగతా అభివృద్ది పథకాలపై తక్కువ కేటాయింపులను చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆప్ సర్కార్ నుంచి కేంద్రం వివరణ కోరిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బడ్జెట్ కు కేంద్రం ఆమోద ముద్ర వేయలేదని పేర్కొన్నాయి.