ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్టు ఆప్ ఆరోపించింది. సింఘు సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తున్న రైతులను కలిసిన అనంతరం ఆయన్ను పోలీసులు నిర్బంధించినట్లు పేర్కొంది.
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు సీఎం కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధంలో పెట్టారు. సింఘు సరిహద్దు వద్ద అన్నదాతలను కలిసిన అనంతరం కేజ్రీవాల్‌పై ఈ చర్యలు తీసుకున్నారని, తన నివాసాన్ని వీడేందుకు కానీ, ఇతరులను లోపలికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
దీనిపై ఆప్ స్పందిస్తూ… మా ఎమ్మెల్యేలను కొట్టారని, సీఎం నివాసం వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారన్నారు. పని మనిషిని కూడా లోపలికి వెళ్లనివ్వడం లేదని, ఆప్ నేతలమంతా వెళ్లి… సీఎంను గృహ నిర్బంధం నుండి విడుదలకు డిమాండ్ చేస్తామని ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ హెచ్చరించారు.
దీన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఆప్ ఆరోపణల్లో నిజం లేదని… ముఖ్యమంత్రి బయటకు వచ్చి, ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లొచ్చని స్పష్టం చేశారు. కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కేజ్రీవాల్ ఇంటి వద్ద బలగాలను మోహరించినట్టు వివరించారు.