గుజరాత్ రాష్ట్రంలోనూ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన ఈ కంచుకోటను బద్దలు కొట్టాలన్నదే ఆయన ధ్యేయం. బడా నేతలతో మీటింగులకన్నా సామాన్య ప్రజలతో మమేకమవుదామనుకున్నారేమో.. సోమవారం ఆయన అహ్మదాబాద్ లో ఈ రాష్ట్ర ఆటో డ్రైవర్లతో సమావేశమై.. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్.. డిన్నర్ కోసం తన ఇంటికి రావాలని ఆయనను కోరాడు. నేను మీ అత్యంత అభిమానినని, పంజాబ్ లో ఓ ఆటోడ్రైవర్ ఇంట్లో మీరు డిన్నర్ చేయడం సోషల్ మీడియాలో చూశానని, ఇప్పుడు అలాగే తన ఇంటికి కూడా డిన్నర్ కి రావాలని కోరాడు. విక్రమ్ లాల్తానీ అనే ఈ ఆటో డ్రైవర్ ఇలా అనగానే ఇతర డ్రైవర్లంతా ఆశ్చర్యపోతూ చప్పట్లు కొట్టారు. అయితే ఇందుకు కేజ్రీవాల్ వెంటనే తప్పకుండా వస్తానని అన్నారు.
పంజాబ్ లో కొందరు ఆటోడ్రైవర్ల ఇళ్లకు తాను వెళ్లానని, వాళ్లంతా తన పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపారని తెలిపారు. ఇక్కడి ఆటోడ్రైవర్లకు కూడా తనంటే ఎంతో అభిమానమన్నారు. మీ ఇంటికి రాత్రి 8 గంటలకు వస్తానని, తనను పిక్ చేసుకోమని కేజ్రీవాల్ అన్నారు. నేను బస చేసిన హోటల్ కి ఆ సమయానికి వచ్చి నన్ను పికప్ చేసుకో అని ఆయన చెప్పగానే ఆ ఆటోడ్రైవర్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ ఇలా అందరిపట్లా ఆదరణ చూపడంలో విశేషం లేదంటున్నారు.