ప్రధాని మోడీ డిగ్రీలపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పట్టు వదలలేదు. మోడీ డిగ్రీలకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిన అవసరం లేదంటూ ఆయన వేసిన పిటిషన్ ని గుజరాత్ హైకోర్టు నిన్న కొట్టివేసింది. పైగా ఇలాంటి పిటిషన్ వేసినందుకు 25 వేలరూపాయల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.నాలుగువారాల్లోగా దీన్ని చెల్లించాలని ఆదేశించింది. కానీ కేజ్రీవాల్ తన ఆరోపణల తాలూకు ఉధృతిని పెంచారు.
మోడీ విద్యార్హతలపై కోర్టు ఉత్తర్వులు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయని ఆయన శనివారం పేర్కొన్నారు. ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉన్నందున ఆయన విద్యావంతుడై ఉండాలని అన్నారు. .. గుజరాత్ యూనివర్సిటీ ఈ సమాచారాన్ని ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఇది మోడీ మొండితనానికి పరాకాష్టా లేక ఆయన డిగ్రీలు బూటకమా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేజ్రీవాల్ చెప్పారు.
2016 లో ప్రధాని విద్యార్హతలకు సంబంధించి సమాచార హక్కు కింద ఆప్ నేత ఒకరు వివరాలు తెలియజేయాల్సిందిగా అప్పటి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై .. మోడీ గ్రాడ్యుయేషన్,పీజీ డిగ్రీల సమాచారాన్ని
వెల్లడించాలని ఆయన గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించారు.
అయితే మోడీ డిగ్రీ వివరాలను గుజరాత్ యూనివర్సిటీ వెంటనే తన వెబ్ సైట్ లో పెట్టి కూడా .. శ్రీధర్ ఆచార్యులు ఉత్తర్వులను సవాల్ చేసింది. గత నెలలో గుజరాత్ యూనివర్సిటీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ సమాచారాన్ని ఈ రెండు యూనివర్సిటీలు ఇవ్వవవలసిన అవసరం లేదని హైకోర్టుకు స్పష్టం చేశారు.ఎవరో ‘చైల్డిష్’ గా, బాధ్యతా రాహిత్యంగా సమాచారం కోరితే దానికి స్పందించవలసిన పని లేదన్నారు. ఇక గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరేన్ వైష్ణవ్ సైతం.. అరవింద్ కేజ్రీవాల్ తీరును తప్పు పట్టారు. పబ్లిక్ డొమైన్ లో ప్రధాని విద్యార్హతలకు సంబంధించిన సమాచారం ఇదివరకే ఉందని, కానీ మీరు అనవసరంగా ఓ వివాదాన్ని లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు.