మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. ఐదేళ్లలో సిసోడియా ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్లను ఎంతో అభివృద్ధి చేశారని, అందుకే ఆయనను అరెస్టు చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. సాధువు, మహాత్ముని లాంటి సిసోడియాను జైలుకు పంపారు.. ఇందుకు మీరు సిగ్గు పడాలి అని ఆవేశంగా వ్యాఖ్యానించారు.
ఆదివారం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆయన.. 40 శాతం కమీషన్ తీసుకుంటున్నవారిని జైళ్లకు పంపడం లేదని, కానీ కేంద్రం సిసోడియాను జైలు పాలు చేసిందని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సిబిఐ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు రోజులు పొడిగించడాన్నిఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
సిసోడియాను మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ అంతకు ముందు ఆరోపించారు. తప్పుడు ఒప్పుకోలు ప్రకటనపై సంతకం చేయాలని ఆయనపై సీబీఐ ఒత్తిడి తెస్తోందన్నారు.
జైల్లో సిసోడియాకు ఈ వేధింపులు తప్పడంలేదన్నారు. ఈడీ, సిబిఐ సంస్థలు కేంద్ర ఆదేశాలపై పని చేస్తున్నాయని, గత ఎనిమిదేళ్లలో ఇవి కనీసం మూడు వేలసార్లు దాడులు నిర్వహించాయని ఆయన అన్నారు. 95 శాతం దాడులు విపక్ష నేతలపైనే జరుగుతూ వచ్చాయన్నారు.