బీజేపీ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. భారత్ తర్వాత స్వాతంత్ర్యం పొందిన పలు దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లైనా భారత్ ఇంకా పేదరికంలో ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్బావ సభలో ఆయన మాట్లాడుతూ… తనను తెలంగాణకు పిలిచి రెండు మంచి కార్యక్రమాల్లో పాల్గొనెలా సీఎం కేసీఆర్ చేశారని ఆయన అన్నారు. కంటి వెలుగు అద్భతమైన పథకమన్నారు. దీన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామన్నారు. కేసీఆర్ తనకు పెద్దన్నలాంటి వారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ గవర్నర్లను అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరింపులకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. తెల్లారి లేచినప్పటి నుంచి ఎవరిని బెదిరించాలా అనే మోడీ ఎప్పుడూ ఆలోచిస్తారని ఆయన ఆరోపించారు.
దేశంలో బీజేపీ సర్కార్ ఓ నియంతలాగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తోందన్నారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా మోడీ సర్కార్ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ స్వయంగా గవర్నర్లను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.