ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు రోజులుండగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎవరితో నైనా తాను చర్చలకు సిద్ధమేనన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు డెడ్ లైన్ విధించారు. డెడ్ లైన్ లోపల ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకపోతే తాను మరో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు.
పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని వెల్లడించకుండా ఆ పార్టీ నేత అమిత్ షా ”బ్లాంక్ చెక్” అడుగుతున్నారని అన్నారు. ఢిల్లీ ప్రజల తీర్పు తర్వాతనే తాము ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తామని అమిత్ షా చెబుతానంటున్నారు…కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం వాళ్ల ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తెలుసుకొని ఓటేయాలనుకుంటున్నారని చెప్పారు. ఎవరో ఒకరు విద్యావంతుడు కాని వారిని, అసమర్ధున్ని ప్రకటిస్తే ఢిల్లీ ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనన్నారు కేజ్రీవాల్.
ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విడుదల చేశారు. 28 పాయింట్ల గ్యారంటీ కార్డులో క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, క్లీన్ వాటర్, నిరంతర విద్యుత్ వంటివి ఉన్నాయి. ఢిల్లీ జన్ లోక్ పాల్ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది.
ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎన్నికలకు ముందే ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుండగా… ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్ధిని ప్రకటించే సాంప్రదాయం తమ పార్టీలో లేదని బీజేపీ చెబుతోంది. చాలా సందర్భాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు…ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీదనే బీజేపీ ఓట్లు అడుగుతుంది. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు