ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈ నెల 22 న నిర్వహించాలని ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ..లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనాకు లేఖ రాశారు. ఇప్పటికే ఈ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదని సుప్రీంకోర్టు నిన్న తీర్పు నిచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ .. సక్సేనాకు ఈ ‘సిఫారసు’ చేసినట్టు భావిస్తున్నారు.
పైగా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఆప్ కి పెద్ద ఊరట కూడా. హౌస్ మీటింగ్స్ లో నామినేటెడ్ సభ్యులు లేదా ఆల్డర్ మెన్ ఓటు చేయజాలరని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం కూడా స్పష్టం చేస్తోంది.
మేయర్ ఎన్నికకు సంబంధించి మొదటి మీటింగ్ నిర్వహించడానికి 24 గంటల ముందు నోటీసు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నిక త్వరగా నిర్వహించాలని ఆప్ తరఫున మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఇదివరకే కోర్టును కోరారు.
లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులకు ఓటింగ్ హక్కు లేదంటూ ఆప్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతోను, దీన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకించడంతోను లోగడ జరిగిన మూడు సమావేశాల్లో పెద్ద ఎత్తున రభస జరిగింది. మరి ఈ నెల 22 న మేయర్ ఎన్నిక సజావుగా జరుగుతుందా అని విశ్లేషకులు తర్జనభర్జన పడుతున్నారు.