పోలీస్ ట్రైనింగ్ ఎంతో కఠినంగా ఉంటుంది. ఉద్యోగం మాట దేవుడెరుగు ముందైతే జీవింతం మీద విరక్తిపుడుతుంది. వ్యాయామం అనేది వాళ్ళజీవితంలో అంతర్భాగం అయిపోవాలని ఆఫీసర్స్ ఇచ్చిన ట్రైనింగ్ ఉద్యోగం రాగానే ఉష్ ఫటాక్ అవుతుంది.
ఇట్స్ టైమ్ ఫర్ రిలాక్స్ అనుకుంటారు. లెక్కాపత్రం లేని ఫుడ్ టైమింగ్స్, మితిమీరిన భోజనం,క్రైమ్స్, స్ట్రెస్,టెన్షన్ వగైరా వగైరా లాంటి కారణాలతో పోలీసులకు అన్నిటికంటే ముందు పొట్టే ప్రమోషన్ గా వస్తుంది.
అయితే ఢిల్లీలో సీనియర్ పోలీసు అధికారి ఒకరు భారీగా బరువు తగ్గి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. కఠినమైన ఆహార నియమాలతోపాటు క్రమం తప్పని నడకతో ఫిట్‌నెస్ సాధించి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు.
జితేంద్ర మణి ఢిల్లీలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఆయన బరువు 130 కిలోలు. అతను మధుమేహం, అధిక రక్తపోటు, కొవ్వు స్థాయులు పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సమస్యల నుంచి బయటపడాలనుకున్నాడు.
ఈ క్రమంలో బరువు తగ్గాలని నిర్ణయించుకుని.. తన జీవన విధానంలో కఠినమైన మార్పులు చేసుకున్నారు. రోజూ సుమారుగా 15వేల అడుగుల మేర నడిచేవారు. అంతేకాకుండా అధిక పోషకాలు కలిగిన ఆహారం, రోటీలు, రైస్, పండ్లు, సూప్స్, సలాడ్స్ వంటివి ఎక్కువగా తీసుకునేవారు. ఈ క్రమంలో అతను 8 నెలల్లోనే 46 కేజీల బరువు తగ్గారు.
ఈ సందర్భంగా జితేంద్ర మణి మాట్లాడుతూ.. ‘గతంలో నా బరువు 130 కిలోలు. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డా. దీంతో సన్నగా మారాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నేను నెలకు 4.5లక్షల అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలో 8 నెలల్లో మొత్తం 32 లక్షల అడుగుల మేర వాకింగ్ చేశా.
ఇప్పుడు నేను 46 కిలోల బరువు తగ్గా. ప్రస్తుతం నా బరువు 84 కిలోలు. నా నడుము చుట్టుకొలత 12 అంగుళాలు తగ్గింది’ అని డీసీపీ జితేంద్ర మణి సంతోషంగా చెప్పుకున్నారు. కాగా, జితేంద్ర మణి కృషిని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోడా ప్రశంసించారు. పోలీస్ శాఖ తరఫున ఆయనకు ఓ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.