బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై మరో నటి నోరా ఫతేహి పరువు నష్టం దావా వేశారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తనపై జాక్వెలిన్ అసత్య ఆరోపణలు చేసిందంటూ ఫతేహి పేర్కొంది. జాక్వెలిన్ తో పాటు పలు మీడియా సంస్థల పేర్లను కూడా పిటిషన్ లో ఫతేహి చేర్చారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ కోర్టు ఈ రోజు ఒకే చెప్పింది. దీనిపై ఈ నెల 25న విచారణ చేపట్టనున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 25న కోర్టు విచారణకు రానున్న పిటిషన్‌ల జాబితాలో నోరా పిటిషన్‌ను చేర్చింది.
మనీలాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్ర శేఖర్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం అరెస్టయ్యాడు. సుఖేశ్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆమె పేరును కూడా అధికారులు చేర్చారు.
ఈడీ విచారణలో నోరా ఫతేహీ పేరును జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బయటపెట్టింది. సుఖేశ్ నుంచి తనతో పాటు నోరా ఫతేహీ కూడా బహుమతులు అందుకున్నారంటూ పేర్కొంది. దీంతో నోరాఫతేహీకి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవేలనని విచారణ సమయంలో నోరా ఫతేహీ పేర్కొన్నారు. ఆ మేరకు తనపై ఆరోపణలు చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పైన, ఆమె ఆరోపణలను ప్రచురించిన మీడియా సంస్థలపైన నోరా ఫతేహి రూ.200 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.