ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం సీబీఐకి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్ లోని ఝరియా కోల్ బ్లాక్స్‌కు బిడ్స్ వేసేందుకు నిర్ధేశించిన అర్హతలు లేకున్నప్పటికీ అదానీ, ఏంఎఆర్ ఇండియా, ల్యాంకో ఇన్ ఫ్రా టెక్ సంస్థలను ఎందుకు అనుమతించారనే విషయంపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది.
ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా తగిన పత్రాలను సమర్పించని విషయాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నికల్ ఎవాల్యుయేషన్ కంపెనీ గతంలో ఎత్తి చూపిందని సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ భరద్వాజ్ తెలిపారు. ఆ తర్వాత కూడా ఆ కంపెనీలు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని న్యాయమూర్తి చెప్పారు.
ఈ క్రమంలో దీనిపై దర్యాప్తు జరిపి ఏప్రిల్ 15లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. అదానీ, ఏఎమ్‌ఆర్ ఇండియా, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, అనే మూడు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఏర్పాటైన టెండర్ కమిటీ సభ్యులు ఏమైనా సహాయం చేశారో చెప్పాలంటూ గత నెలలో సీబీఐని ప్రత్యేక న్యాయస్థానం అడిగింది.
దీనికి సీబీఐ బదులిస్తూ… అదానీ ఎంటర్‌ప్రైజ్ సమర్పించిన టెండర్ పత్రాలు నిర్దేశిచిన అర్హతలకు అనుకూలంగా లేవని సీబీఐ పేర్కొంది. సదరు కంపెనీ అర్హత విషయంలో పరిశీలించాలని ప్రత్యేకంగా తమకు నిర్దేశించలేదని సీబీఐ పేర్కొంది. అంతే కాకుండా ఇందులో ల్యాంకో ఇన్ ఫ్రా టెక్ కు కాంట్రాక్ట్ వచ్చిందని సీబీఐ పేర్కొంది.
ఇందులో మైన్ డెవలపర్, ఆపరేటర్ నియామకంలో చట్టవిరుద్ధమైన కాంట్రాక్టు మంజూరిపై దర్యాప్తు జరగుతోందన్నారు. ఇందులో కాంట్రాక్టు పొందని కంపెనీల గురించి విచారణ పెద్దగా జరగలేదని తెలిపింది. కాంట్రాక్టు పొందని కంపెనీలకు ఇందులో లబ్ది జరగలేదని తాము భావించినట్టు చెప్పింది.
దీనిపై న్యాయస్థానం స్పందించి… తదుపరి దర్యాప్తు సమయంలో కేవలం ఈ ఆదేశాల్లోని అంశాలకు మాత్రమే కాకుండా, అధికారి అవసరమని భావిస్తే ఈ కేసులో ఇతర అంశాలపై కూడా దర్యాప్తు నిర్వహించవచ్చునని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.